హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.)
కాళేశ్వరంపైన బీఆర్ఎస్ నేత సోయి లేకుండా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆనాడే తుమ్మిడి హట్టి దగ్గర బ్యారేజ్ కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా? కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసింది మీరు కాదా? అని నిలదీశారు. మీ హయాం లోనే మేడిగడ్డ కూలింది హరీశ్రావు.. గుర్తు లేదా అంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. కూలినప్పుడే పోలీసులు ఎఫ్ఎఆర్ చేశారని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేయోద్దని చెప్పిందని గుర్తుకు చేశారు. కాళేశ్వరం కట్టింది మీ హయాంలోనే.. కూలింది కూడా మీ హయాంలోనే అంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ వాళ్లు బాంబులు పెట్టారని, కుట్ర చేశారని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మీ అవినీతి అక్రమాల వల్లనే కాళేశ్వరం కూలిందని ఆరోపించారు. కాళేశ్వరం తెలంగాణకు గుదిబండలా మారిందని తెలిపారు. మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసి ఆ బ్యారేజ్ కొట్టుకుపోయి మా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని హరీశ్రావు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మేం అన్ని ప్రాజెక్ట్ లు నింపుతాం.. రైతులకు నీళ్లు ఇస్తాం.. నువ్వు బురద రాజకీయాలు మానుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
—————
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..
