న్యూఢిల్లీ: ,21 ఆగస్టు (హి.స.) రాష్ట్ర శాసనసభ రెండోసారి ఆమోదించి పంపిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపే వీలులేదని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో గవర్నర్లకు ఉన్న అధికారాలేమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘శాసనసభ పునఃపరిశీలనకు బిల్లును తిప్పి పంపాలనే నిర్ణయాన్ని గవర్నర్ ఎంచుకుంటే.. ఆ బిల్లును నిలిపి ఉంచడానికి, రాష్ట్రపతి పరిశీలనకు పంపడానికి వీలు లేదు’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఏ.ఎస్. చందూర్కర్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలపడంపై గవర్నర్లకు, తనకు గడువు నిర్దేశిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టు అభిప్రాయం కోరిన అంశంపై రెండో రోజైన బుధవారమూ రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది.
—————
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు
