హిందూపురం, వైకాపా సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ ఇక్బాల్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడటంతోపాటు టపాసులు కాల్చినందుకు ఆర్యవైశ్య సంఘం సభ్యుడు, వైకాపా నాయకుడు కార్తీక్‌పై వైకాపా జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు లోకేశ్‌తోపాటు మరో 8 మంది దాడిచేశారు. శుక్రవారం అర్ధరాత్రి శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడిన కార్తీక్‌ను స్థానికులు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. నిందితులపై పోలీసులు శనివారం కేసు నమోదు చేసి రెవెన్యూ అధికారి ఎదుట బైండోవర్ చేశారు. లోకేశ్‌పై గతంలోనూ పలు కేసులున్నాయి. తనను చంపడానికి ప్రయత్నిస్తే పోలీసులు చిన్నపాటి కేసు నమోదు చేసి వదిలేశారని కార్తీక్ వాపోతున్నారు. అంతకుముందు వారంతా ఇక్బాల్ వర్గీయులే కావడంతో వారి మధ్య జరిగిన చిన్న గొడవగా చిత్రీకరించి కేసు లేకుండా రాజీ చేయడానికి వైకాపా ముఖ్య నాయకులు ప్రయత్నించారని సమాచారం. కార్తీక్‌ను ఆర్యవైశ్య సంఘం నాయకులు పరామర్శించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
