ఢిల్లీ సీఏఏపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ సహా తృణమూల్, సీపీఐ, ఆప్, సమాజ్‌వాదీ తదితర పార్టీలు ఈ చట్టాన్ని ఇప్పటికే వ్యతిరేకిస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం ఈ చట్టాన్ని వ్యతిరేకించారు. సీఏఏ చట్టం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని, అలాంటి చట్టాన్ని తమిళనాడు రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టం చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వల్ల ఎలాంటి ఉపయోగం గానీ, ప్రయోజనాలు గానీ లేవు. ఇది పూర్తిగా అసమంజసమైనది. ఇది భారతీయ ప్రజల మధ్య విభేదాలను సృష్టిస్తుంది. దీనిని తప్పనిసరిగా రద్దు చేయాలి’ అని సీఎం స్టాలిన్ ఓ ప్రకటనలో తెలిపారు.
