దిల్లీ: 14 ఏప్రిల్ (హిం.స)డీఎంకే పార్టీ మాజీ నాయకుడు, సినీనిర్మాత జాఫర్ సాదిఖ్ (36) మాదకద్రవ్యాల అక్రమరవాణా ద్వారా ఆర్జించిన సొమ్ములో రూ.40 కోట్లను చిత్ర నిర్మాణానికి.. హోటల్, స్థిరాస్తి వ్యాపారాలకూ మళ్లించాడని ఈడీ శనివారం ఆరోపించింది. సాదిఖ్ ‘మంగై’ అనే తమిళ సినిమా తీశాడు. చెన్నైలో ఒక హోటలు నిర్మించాడు. తమిళ, హిందీ చిత్ర ఫైనాన్షియర్లతో అతడికున్న సంబంధాలు, రాజకీయ నాయకులకు నిధులు సమకూర్చిన వైనాన్ని శోధిస్తున్నామని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి) తెలిపింది. రూ.2,000 కోట్ల విలువైన 3,500 కిలోల సూడో ఎఫిడ్రిన్ అనే మత్తుకారక రసాయనాన్ని అక్రమంగా రవాణా చేశాడంటూ ఎన్.సి.బి. గత నెలలో సాదిఖ్‌ను అరెస్టు చేసింది. సాదిఖ్ ముఠా కొబ్బరిపొడి, బలవర్ధక పౌడర్లలో సూడో ఎఫిడ్రిన్‌ను కలిపి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు రవాణా చేసేది. సాదిఖ్ కిలో మత్తు పదార్థానికి రూ.లక్ష చొప్పున కమీషన్ తీసుకునేవాడని ఎన్.సి.బి. వివరించింది. చెన్నై, మధురై, తిరుచిరాపల్లిలలో గల సాదిఖ్ ఆస్తులు, సంబంధీకులపై ఈ నెల 9న ఈడీ దాడులు చేసింది. సాదిఖ్ బాగోతం బయటపడగానే గత ఫిబ్రవరిలో డీఎంకే అతణ్ని పార్టీ నుంచి బహిష్కరించింది. సాదిఖ్‌తో తమ పార్టీకి ఎలాంటి సంబంధాలూ లేవని తమిళనాడు న్యాయమంత్రి, డీఎంకె నేత ఎస్.రఘుపతి ఇప్పటికే ప్రకటించారు.
