ఢిల్లీ : ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనలను ఉద్ధృతం చేసింది. ఇందులో భాగంగా నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజధాని వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాన రహదారుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ప్రధాని మోదీ నివాసం నలుదిక్కులా భారీగా పోలీసులు మోహరించారు. ఆప్ ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు.మరోవైపు ఆప్ ఆందోళనల నేపథ్యంలో మోదీ నివాసానికి సమీపంలోని మూడు మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. లోక్ కల్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్లోని ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మంగళవారం తెలిపింది. అదేవిధంగా పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్పై పరిముతులు విధించినట్లు పేర్కొంది. ‘భద్రతా కారణాల దృష్ట్యా లోక్ కల్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్లోకి అనుమతి లేదు. అదేవిధంగా పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 3, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 5ను మూసివేశాం. తదుపరి నోటీసు వచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి’ అని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది.
