ముంబయి:, 9 సెప్టెంబర్ (హి.స.)
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ)లోని గంటను అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సోమవారం మోగించారు. స్టాక్ ఎక్స్ఛేంజీకి సంబంధించి మైలురాయి లాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు వేడుకకు చిహ్నంగా అక్కడ ఏర్పాటు చేసిన గంట మోగిస్తుంటారు. సమాజంలోని విశిష్ట వ్యక్తులకు, జాతీయ ప్రాధాన్యం కలిగిన ప్రముఖులకు గంట మోగించే అవకాశాన్ని ఓ గౌరవ సూచకంగా ఇస్తుంటారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా అందించిన సేవలకు, సినీ కెరీర్‌లో నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణకు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ ఘనతను సొంతం చేసుకొన్న తొలి దక్షిణాది నటుడు ఆయనే కావడం విశేషం. హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయ రంగంపైనా తనదైన ముద్ర వేస్తున్న బాలకృష్ణ ఇటీవల లండన్‌కు చెందిన ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
