ఢిల్లీ , 25,అక్టోబర్ ,( హిం.స) ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన అనేక సమస్యలపై ఆప్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ప్రజల దృష్టిని వాస్తవ సమస్యల నుంచి మళ్లించేందుకే ప్రభుత్వం సట్లెజ్ యమునా లింక్ కాలువ సమస్యకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. జలంధర్‌లో ఏర్పాటు చేసిన మీడియ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ స్వలాభం కోసం వ్యవస్థను మార్చుకోవడం దారుణమన్నారు. ఆ వ్యవస్థ రాష్ట్రాన్ని వెనుకకు నెట్టివేసిందన్న ఆయన, అందుకే నేటికీ వాస్తవ సమస్యల నుండి దృష్టి మరల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
పంజాబ్‌లో 80 శాతం నీరు డార్క్ జోన్‌లో ఉందని, రాష్ట్రంలో తక్కువ నీరు ఉందని, అయితే తమ వద్ద ఉన్న నీటిని ఆదా చేసేందుకు ప్రభుత్వం ఏమీ చేయడం లేదని సిద్ధూ మండిపడ్డారు. తాగునీరు దొరకని విధంగా నీటి సమస్య పెరిగిందన్న ఆయన.. పంజాబ్‌లో నీటి కొరత తీర్చడంలో ఆప్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. గత పదేళ్లలో వర్షపాతం 30 శాతం తగ్గిందన్న సిద్ధూ.. ముఖ్యమంత్రికి జనం బాధలు పట్టడం లేదని విరుచుకుపడ్డారు.
హిందుస్థాన్ సమాచార, నాగరాజ్
