ఢీల్లీ, 9 సెప్టెంబర్ (హి.స.)నూతన ఉపరాష్ట్రపతి (Vice President)ని ఎన్నుకునేందుకు మంగళవారం ఉదయం 10 గంటలకు పార్లమెంటు నూతన భవనంలో ‘ఎఫ్-101 వసుధ’లో పోలింగ్ మొదలైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తొలి ఓటు వేశారు. ఓటింగ్ మొదలైన కొద్ది సేపటికే కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) , అర్జున్ రామ్ మేఘ్వాల్, కిరణ్ రిజిజు, రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ హరివంశ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పార్టీ విప్‌లు లేకుండా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఉప రాష్ట్రపతి పదవికి ఓటింగ్ జరుగుతోంది. దీంతో ఎన్డీయే, ‘ఇండియా’ కూటమి నేతలు క్రాస్ ఓటింగ్ జరగవచ్చని, తమ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉభయసభలకు చెందిన 781 మంది ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా, మెజారిటీ సాధించడానికి 391 ఓట్లు అవసరమవుతాయి. ఎన్డీయేకు 425 మంది ఎంపీల మద్దతు కనిపిస్తుండగా, విపక్ష ఇండియా కూటమికి 324 ఎంపీల బలం ఉంది.
కాగా, భారత మాజీ ప్రధాని, రాజ్యసభలో జేడీ (ఎస్) ఎంపీ హెచ్‌డీ దేవెగౌడ (HD Deve Gowda) పార్లమెంటుకు వీల్‌చైర్‌పై వచ్చారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
—————
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి
