,అహ్మదాబాద్:, 09,జనవరి (హిం.స) ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పర్యటన కోసం సోమవారం రాత్రి ఆయన అహ్మదాబాద్కు చేరుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మోదీనే తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో మోదీకి రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ స్వాగతం పలికారు. విమనాశ్రయం నుంచి ఆయన నేరుగా రాజ్భవన్కు వెళ్లారు. రెండు రోజుల అహ్మదాబాద్ పర్యటనలో మోదీ వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్తోపాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ శిఖరాగ్ర సదస్సులో పలువురు ప్రపంచ నేతలు పాల్గొనడం సంతోషంగా ఉందని, తన సోదరుడు మహమ్మద్ బిన్ జాయెద్ రాక ప్రత్యేకమైనదని ఎక్స్లో ప్రధాని పేర్కొన్నారు. ఈ వేదిక గుజరాత్ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చెప్పారు.
‘‘రాబోయే రెండు రోజుల్లో నేను వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్, సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటాను. ఈ సమ్మిట్ సందర్భంగా వివిధ ప్రపంచ నాయకులు మాతో చేరడం ఎనలేని సంతోషకరమైన విషయం. నా సోదరుడు మహమ్మద్ బిన్ జాయెద్ రావడం చాలా ప్రత్యేకమైనది. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్తో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఈ ప్లాట్ఫారమ్ గుజరాత్ అభివృద్ధికి చాలా దోహదపడింది. ఈ వేదిక చాలా మందికి అవకాశాలు సృష్టించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అని ఎక్స్లో చేసిన పోస్ట్లో మోదీ తెలిపారు
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
