ఢిల్లీ,13,, డిసెంబర్ (హిం.స) తక్షణ కాల్పుల విరమణకు, బేషరుతుగా బందీల విడుదలకు డిమాండ్ చేస్తూ ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటేసింది. ఐరాస అత్యవసర ప్రత్యేక సమావేశంలో భాగంగా ఈజిప్టు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. 193 సభ్యదేశాల్లో 153 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. 23 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. దీంతో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది.
ఈ తీర్మానంపై ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడారు. ‘జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటేసింది. అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై ఉగ్రదాడి జరిగింది. అప్పుడు హమాస్ చెరలో ఉన్న బందీల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ప్రస్తుతం గాజాలో అపార ప్రాణనష్టం సంభవిస్తోంది. మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీర్గకాలిక పాలస్తీనా సమస్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని కాంబోజ్ వెల్లడించారు. అలాగే ఈ తీర్మానానికి ఆమోదం లభించడాన్ని ఆమె స్వాగతించారు.
హిందుస్థాన్ సమాచార,నాగరాజ్
