,దిల్లీ,20,జనవరి (హిం.స) అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరు కాబోదనే అధిష్టాన నిర్ణయంపై ఆ పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా గుజరాత్కి చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామాచేశారు. విజాపూర్ నియోజకవర్గం నుంచి సీజే చావ్డా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనవరి 22న రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ వెళ్లవద్దని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తొలి నుంచి వ్యతిరేకించారు.
శనివారం పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా కాంగ్రెస్లో పని చేశాను. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంతో దేశం మొత్తం హర్షం వ్యక్తం చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం వేడుకకు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం నన్ను బాధ పెట్టింది. అందుకే రాజీనామా చేస్తున్నాను. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో రామ మందిర నిర్మాణం జరగింది.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
