కారాజిన్హో ,03 జనవరి (హి.స.)ఇసుక లోడుతో వెళ్తున్న లారీ.. ఎదురుగా వస్తున్న బస్సు పరస్పరం వేగంగా ఢీ కొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన బ్రెజిల్ దేశంలో జరిగింది. ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రియోగ్రాండే డో సుల్ రాష్ట్రంలోని కారాజిన్హో సమీపంలో నేషనల్ హైవేపై వేగంగా వచ్చిన రెండు వాహనాలు ఢీ కొన్నట్లు ఫెడరల్ హైవే పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు క్యాబినా లారీలోకి చొచ్చుకుని పోగా.. లారీలోని ఇసుక బస్సులో ఉన్న ప్రయాణికులపై పడింది. దీంతో ఊపిరాడక 11 మంది స్పాట్లో చనిపోయారు. లారీలోని ఇసుకంతా బస్సులో పడటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. పోలీసులు ఎంతో ప్రయాసకోర్చి మృతదేహాలను , గాయపడిన వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంతో హైవేపై గంటల తరబడి రాకపోకలకు అంతరాయం కలిగింది. గతేడాది తెలంగాణలోని తాండూర్ లో ఇదే తరహా బస్సు ప్రమాదం జరగ్గా.. 20 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు.
—————
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV
