ఢిల్లీ , 12 డిసెంబర్ (హి.స.)
ఢిల్లీ వాయు కాలుష్యంపై చర్చ జరగాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో చర్చకు ప్రతిపాదన పెట్టారు. కాలుష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్యం ప్రభావం ఉందని చెప్పారు. దుప్పటిలా కప్పుకున్న విషపూరితమైన గాలిలో ప్రజలు జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిలియన్ల కొద్ది చిన్నారులు విషపూరిత గాలి వల్ల ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారని వాళ్ల జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు.
చాలా మంది క్యాన్సర్ బారినపడుతున్నారని, వృద్ధులు శ్వాస తీసుకోలేక ఇబ్బందిపడుతున్నారని అన్నారు. ఈ విషయం సభలో ఉన్న ప్రతిఒక్కరూ అంగీకరించాల్సిందేనని వ్యాఖ్యానించారు. దీనిని రాజకీయ కోణంలో చూడకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చర్చ జరపాలని రాహుల్ కోరారు. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్యం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీలో అయితే దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాలుష్యం నేపథ్యంలో అక్కడ ఆంక్షలు విధించాల్సి వస్తోంది. చలికాలం వచ్చిందంటే ప్రజలు కనీసం ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి.
—————
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV
