తమిళనాడు : విరుధ్‌నగర్ జిల్లాలోని కరియపట్టి సమీపంలోని క్వారీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. జిల్లా అగ్నిమాపకశాఖ అధికారులు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిలో ఒక తెల్లటి భవనం వద్ద భారీ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. దీనిలో క్వారీకి సంబంధించిన పేలుడు పదార్థాలను భద్రపరిచినట్లు అనుమానిస్తున్నారు. శకలాల్లో పేలుడు పదార్థాల ఆనవాళ్లను అధికారులు సేకరిస్తున్నారు.
ఇక్కడి క్వారీపై స్థానికులు కొన్నేళ్లుగా ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిలో కనీసం భద్రతా ప్రమాణాలను పాటించడంలేదని ఆరోపిస్తున్నారు. ఇక్కడికి వచ్చే ఓవర్‌లోడ్ ట్రక్కుల కారణంగా చాలా ప్రమాదాలు జరిగినట్లు చెబుతున్నారు. ఈ పేలుడు ఘటనకు కొన్నాళ్ల ముందే క్వారీని తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇదే జిల్లాలోని టపాసుల తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగి 10 మంది మరణించారు. నాడు కెమికల్ మిక్స్ యూనిట్‌లో ఇది చోటు చేసుకొంది.
