శంషాబాద్ : ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లోకి వచ్చిన చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మేక మాంసాన్ని ఎరగా పెట్టినా ఫలితం లేకపోవడంతో.. ఈసారి ఏకంగా 5 మేకలను బోనుల్లో ఉంచారు. చిరుతను బంధించేందుకు ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల 5 బోన్లు, 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
గత నాలుగు రోజులుగా అటవీశాఖకు చెందిన ప్రత్యేక బృందాలు చిరుత కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. మంగళవారం రాత్రి బోన్లు ఏర్పాటు చేసిన 5 చోట్లా ఒక్కో మేకను వాటిలో ఉంచారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా చిరుత మాత్రం చిక్కడం లేదు. ఒకే ప్రాంతంలో సంచరిస్తూ బోను వరకు వచ్చి వెనక్కి వెళుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
