బెంగళూరు: కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయంలో కొందరు పాకిస్థాన్‌కు మద్దతుగా నినాదాలు చేయడం కలకలం రేపింది. ఆ వ్యక్తిని తక్షణమే అరెస్టు చేయాలని విపక్ష భాజపా పట్టుబట్టింది. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసినట్లు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
‘కేవలం భాజపానే ఆ ఆరోపణలు చేయలేదు. మీడియా కూడా అదే విషయాన్ని చెబుతోంది. వాయిస్ రిపోర్టును ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కి పంపించాం. దేశ వ్యతిరేక నినాదాలు చేయడం వాస్తవమని అందులో తేలితే.. ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అటువంటి వారిని విడిచిపెట్టే ప్రశ్నే లేదు’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు.
