దిల్లీ ,05,ఫిబ్రవరి (హిం.స) భారత విదేశాంగ శాఖలో పనిచేస్తూ.. పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న ఓ భద్రత అధికారిని ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) అరెస్టు చేసింది. నిందితుడిని యూపీలోని హాపుర్ జిల్లా షమాహియుద్దీన్పూర్కు చెందిన సత్యేంద్ర సివాల్గా గుర్తించినట్లు ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఏటీఎస్ తెలిపింది. భారత విదేశాంగ శాఖలో పనిచేస్తున్న పలువురు అధికారులు, సిబ్బంది పాక్ నిఘా సంస్థ ఐఎ్సఐ తరఫున గూఢచర్యం చేస్తున్నట్లు సమాచారం అందడంతో నిఘా పెట్టినట్లు తెలిపింది. ‘‘ఈ క్రమంలో సత్యేంద్రకు వ్యతిరేకంగా భౌతిక, డిజిటల్ ఆధారాలను సేకరించాం. మేరఠ్లోని ఏటీఎస్ కార్యాలయానికి విచారణకు పిలిచాం. అతను తొలుత డొంకతిరుగుడు సమాధానాలిచ్చినా ఆ తర్వాత నేరాన్ని అంగీకరించాడు.
ఐఎ్సఐ తరఫున పనిచేస్తున్నట్లు ఒప్పుకొన్నాడు’’ అని ఆ ప్రకటన స్పష్టం చేస్తోంది. సత్యేంద్ర 2021 నుంచి మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ఇండియా-బేస్డ్ సెక్యూరిటీ అసిస్టెంట్(ఐబీఎ్సఏ)గా పనిచేస్తున్నాడు.
