దిల్లీ,31,జనవరి : భారత సంస్కృతి, సభ్యత ఎంతో చైతన్యవంతమైనవని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతన భవనంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తు భారత సంస్కృతి, సభ్యత ఎంతో చైతన్యవంతమైనవని కొనియాడారు.
మన చిన్నతనం నుంచీ ‘గరీబీ హఠావో’ నినాదాన్ని వింటున్నాం. కానీ, జీవితంలో తొలిసారి పేదరికాన్ని పెద్ద ఎత్తున పారదోలడం చూస్తున్నాం. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్ ముందుకెళ్తోంది.
శతాబ్దాలుగా కలలు కంటున్న రామమందిర నిర్మాణం సాకారమైంది. ఎన్నో ఆటంకాలను అధిగమించి ఆలయాన్ని ప్రారంభించాం.
దేశంలో 5జీ నెట్వర్క్ వేగంగా విస్తరిస్తోంది. కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చాం. ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ నినాదంతో ముందుకెళ్తున్నాం. రక్షణ, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి. యూపీ, తమిళనాడులో రక్షణ కారిడార్లు ఏర్పాటయ్యాయి. రక్షణ రంగ ఉత్పత్తులు భారత్లో తయారవడం గర్వకారణం.
ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచింది. ఆత్మనిర్భరత, మేకిన్ ఇండియా మన బలాలుగా మారాయి.
