అమరావతి, 05 జనవరి (హి.స.) :‘స్వచ్ఛ సంక్రాంతి-స్వచ్ఛ గ్రామ పంచాయతీలు’ అనే కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సోమవారం ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. పంచాయతీల్లో శాస్త్రీయ విధానంలో ఘనవ్యర్థాల నిర్వహణను అమలు చేసి.. చెత్తరహిత, పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ‘స్వచ్ఛ సంక్రాంతి-స్వచ్ఛ గ్రామ పంచాయతీలు-2026’ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గత డిసెంబరు 26 నుంచి ఈ నెల 4వరకు అన్ని పంచాయతీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. వీటిని మరింత ప్రభావవంతంగా అమలు చేసేందుకు ఈనెల 10 వరకు పొడిగించారు. ఈ కార్యక్రమం చివరి నాటికి గ్రామ పంచాయతీల్లోని నాడెప్ తొట్టెలన్నీ తడి చెత్తతో నింపుతారు. ఈ కార్యక్రమం కొనసాగింపుగా, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను శుభ్రంగా ఉంచేందుకు సోమవారం అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో చేపట్టిన చర్యలను తెలియజేయడం, ‘ముందు.. తర్వాత ’ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల భాగస్వామ్యంతో స్వచ్ఛతను నిరంతర కొనసాగించేందుకు తీర్మానాలు ఆమోదిస్తారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
