అమరావతి, 8 ఆగస్టు (హి.స.)గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఏర్పాటై 25 ఏళ్లు అయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు సూచించారు. గురువారం సెర్ప్ కార్యాలయంలో ఆ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు బ్యాంకులు ఆమోదించిన సూక్ష్మ రుణ ప్రణాళికకు సంబంధించి రూ.14369 కోట్లు మొత్తాన్ని త్వరితగతిన ఎస్‌హెచ్‌జీలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 1,71,264 స్వయం సహాయక సంఘాలకు సూక్ష్మ ప్రణాళిక ద్వారా నిధులు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, అందుకనుగుణంగా ఆయా రుణాలను త్వరితగతిన అందజేయాలని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేసి వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు ప్రక్రియ చేపట్టాలని, అందుకున అనుభవం ఉన్న సంస్థల సేవలను ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
