

అమరావ తి, డిసెంబరు 23 (హిం.స): సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 11వ రోజుకి చేరింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల నిరసనలు ఉధృతంగా కొనసాగాయి. మంత్రి ఉషశ్రీచరణ్ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు.
పలు జిల్లాల్లో రాస్తారోకోలు, ఆందోళనలు, ధర్నాలు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు చీరల కోసం రూ. 16కోట్లు ఇచ్చామని, స్మార్ట్‌ఫోన్లకు రూ.85కోట్లు వెచ్చించామని, రీఛార్జ్‌ల కోసం రూ.12కోట్లు ఖర్చు చేశామని విలేకరుల సమావేశంలో మంత్రి చెప్పడంపై అంగన్వాడీలు భగ్గుమన్నారు. ఈ విధంగా మంత్రి చెప్పడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు.
అంగన్వాడీల నిర్వహణ కోసం కేటాయించిన ఆ నిధులను తమ సొంతానికి ఇచ్చినట్లుగా చెప్పడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా పలుచోట్ల జాతీయ రహదారులను నిర్భందించారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
