ఆంధ్రప్రదేశ్ :12 జనవరి (హిం.స) ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC), ఎన్నికల కమిషనర్ల (EC) నియామకం, వారి సర్వీసు నిబంధనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టంపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
ఈ చట్టాన్ని కొట్టేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్‌లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
పాత చట్టం ప్రకారం సీఈసీ, ఈసీలను ప్రభుత్వ సిఫారసుల మేరకు రాష్ట్రపతి నియమించే వారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఇక నుంచి ఈ బాధ్యతలను సెర్చ్, ఎంపిక కమిటీలు నిర్వహించనున్నాయి. అయితే, కొత్త చట్టం ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం నియంత్రించేలా ఉందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్టే విధించాలని కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, కొత్త చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాది గోపాల్ సింగ్ సహా పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
