








అనంతపురం, జనవరి 24 (హిం.స): రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు, సోదరి వైఎస్ షర్మిలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఆమె విపక్ష నేత చంద్రబాబుకు ‘స్టార్ క్యాంపెయినర్’గా మారారని విమర్శించారు.
తన తప్పులను ఎత్తిచూపుతున్న వారంతా చంద్రబాబుకు ‘స్టార్ క్యాంపెయినర్లే’ అన్నట్లుగా ఒకొక్కరిని ఉద్దేశించి వరుస వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం జగన్ నాలుగో విడత వైఎస్సార్ ‘ఆసరా’ కింద బటన్ నొక్కి రూ.6394.83 కోట్ల నిధులను పొదుపు మహిళల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎప్పట్లాగానే విపక్షాల మీద, గిట్టని మీడియా మీద జగన్ విమర్శలు గుప్పించారు.
ఈసారి కొత్తగా చెల్లెలు షర్మిలపైనా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రాన్ని విభజించిన పార్టీలోకి ప్రవేశించి చంద్రబాబుకు మరో స్టార్ క్యాంపెయినర్‌గా మారారు’ అంటూ షర్మిల పేరెత్తకుండానే విమర్శించారు. పొరుగు రాష్ట్రంలో నివాసముంటున్న స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబును జాకీలు పెట్టి లేపుతున్నారంటూ జనసేన అధిపతి పవన్ కల్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని విమర్శించారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
