కాకినాడ, డిసెంబరు 29 (హిం.స) అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వం గద్దె దిగాలని, ఆ పార్టీ ఓడిపోయే వరకు విశ్రమించకుండా ప్రతిఒక్కరూ కసిగా పనిచేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
పొత్తులో భాగంగా టీడీపీ బరిలో ఉన్న చోట, జనసేన బరిలో ఉన్న చోట… పోటీలో ఎవరున్నా సరే గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలను కోరారు. ప్రజాకంటక ప్రభుత్వాన్ని సాగనంపేలా పోరాడాలన్నారు.
మూడురోజుల పర్యటనలో భాగంగా కాకినాడలో గురువారం జిల్లాలో పలు నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో ముఖాముఖి సమీక్ష నిర్వహించారు. ఇకపై పార్టీ నేతలతో ప్రతి పదిరోజులకోసారి టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మొహమాటాలు, రికమండేషన్లకు తావు లేకుండా టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో సర్వే ఆధారంగా సీట్ల కేటాయింపు చేస్తామన్నారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
