విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), జనవరి 20(హిం.స) ముడసర్లోవ పార్కు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని జివిఎంసి కమిషనర్ సిఎం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన రెండవ జోన్ పరిధిలోని ముడసర్లోవ పార్కును అధికారులతో కలసి సందర్శించారు.
ఈ సందర్భంగా జివిఎంసి కమిషనర్ మాట్లాడుతూ ముడసర్లోవ పార్కు ఎంతో పురాతణమైనదని, ఆకర్షణీయమైన చెట్లకు ఆటంకం కలిగించకుండా దీనిని పునరాభివృద్ది చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ప్రకృతికి సహజ సిద్ధంగా ఉండే విధంగా ఈ ముడసర్లోవ పార్కును సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను రూపొందించి ప్రణాళికలకు అనుగుణంగా అంచెలంచెలుగా టెండరు ప్రక్రియ ద్వారా పార్కును అభివృద్ధి పరచాలని ఆదేశించారు. ముఖ్యంగా పార్కులో ఆకర్షణీయమైన మొక్కలతో గార్డెన్ లను ఏర్పాటు చేయడం, కెఫెటీరియా, వాటర్ ఫౌంటైన్స్, సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, హార్స్ రైడింగ్, విశ్రాంతి స్థలం, యోగ ఆవరణ, జిమ్, చిల్డ్రన్ ప్లే ఏరియా మొదలైన సకల సదుపాయాలతో రూపొందించి ప్రజలకు, సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా పార్కు పునరాభివృద్ది పనులు చేపట్టాలని పర్యవేక్షక ఇంజనీరు శాంసన్ రాజును కమీషనర్ ఆదేశించారు.
– కృష్ణమూర్తి, హిందూస్తాన్ సమాచార్.
