అమరావతి, జనవరి 8 ( హిం.స): ఏపీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు చుక్కలు చూపిస్తాయి! కానీ పరీక్ష కంటే ముందు దరఖాస్తు చేసుకోవడానికే ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. గత నెలలో ఏపీపీఎస్సీ గ్రూప్1, 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసింది. గ్రూప్ 2 నోటిఫికేషన్‌కు డిసెంబరు 21 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల 10 చివరి తేదీ.
ఇందుకోసం వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు సమర్పించిన తర్వాత చివర్లో ఫీజు చెల్లించాలి. సరిగ్గా ఫీజు చెల్లించాల్సిన సమయంలో వెబ్‌సైట్‌లో ఎర్రర్ మెసేజ్ ప్రత్యక్షమవుతోంది. దీంతో దరఖాస్తు ప్రక్రియను అక్కడి నుంచి మళ్లీ మొదలుపెట్టాల్సి వస్తోంది. కొంతమంది అభ్యర్థులు పదే పదే ప్రయత్నించినా దరఖాస్తు సబ్మిట్ కావట్లేదు. మరోవైపు దరఖాస్తు తీసుకోకపోయినా అభ్యర్థుల ఖాతాల నుంచి నగదు కట్ అవుతోంది. వారం రోజుల తర్వాత గానీ ఆ నగదు తిరిగి ఖాతాలకు చేరడం లేదు. గ్రూప్1 దరఖాస్తులకు కూడా ఇదే సమస్య తలెత్తుతోంది. అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నా ఏపీపీఎస్సీ మాత్రం ఎప్పటిలాగే మౌనం వహిస్తోంది.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
