ఢిల్లీ,03,జనవరి,(హిం.స)భారతీయ రైల్వేలో స్వయంచాలక రక్షణవ్యవస్థ ‘కవచ్’తోపాటు ప్రమాదాల నివారణకు తీసుకొంటున్న ఇతర భద్రతా చర్యల వివరాలు కోర్టుకు సమర్పించాలని భారత సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశంలో ఇటీవల జరిగిన కొన్ని రైలు ప్రమాదాల నేపథ్యంలో ఇప్పటికే అమలుచేస్తున్న, ప్రతిపాదిత రక్షణ చర్యలను తెలియజేయాలని సుప్రీంకోర్టు కోరింది. రైలు ప్రమాదాల నివారణకు తగిన రక్షణ చర్యలు అమలుచేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విశాల్ తివారీ అనే వ్యక్తి పిటిషను దాఖలు చేశారు. దీని విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ల ధర్మాసనం కేంద్రాన్ని వివరాలు కోరింది. ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద గతేడాది జూన్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే గత మూడు దశాబ్దాల్లో రైళ్లు ఢీకొనడం వల్ల జరిగిన అనేక ప్రమాదాలను పిటిషన్దారు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. భద్రతా చర్యలను బలోపేతం చేయడంలో భారతీయ రైల్వే తాత్సారం చేస్తోందని ఆక్షేపించారు.
ఈ శాఖలో రక్షణ చర్యలను సమీక్షించి తగు సూచనలు చేసేందుకు సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి సారథ్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. పిటిషనరు వాదనలు విన్న ధర్మాసనం ఆ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేస్తూ, తన ఫిర్యాదు ప్రతిని అటార్నీ జనరల్ కార్యాలయంలో అందజేయాలని పిటిషనర్ను కోరింది. ఒకవేళ దేశవ్యాప్తంగా అన్ని రైళ్లలో ‘కవచ్’ను అందుబాటులోకి తీసుకురావాలంటే ఆర్థిక ప్రభావం ఏమేరకు ఉంటుందనే విషయంపై కసరత్తు చేశారా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. పిటిషిను విచారణను ధర్మాసనం నాలుగు వారాలకు వాయిదా వేసింది.
హిందుస్థాన్ సమాచార నాగరాజ్
