ఇంఫాల్ ,,18,జనవరి (హిం.స) మణిపుర్లోని మోరేలో బుధవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసు కమాండోలు మరణించారు. మరో ఇద్దరు పోలీసులు తూటా గాయాలకు గురయ్యారు. మృతులు సోమోర్జిత్ (32), తఖేల్లంబం శైలేశ్వర్లను పశ్చిమ ఇంఫాల్ జిల్లా వాసులుగా గుర్తించారు. ఇమా కొండోంగ్ లైరెంబీ దేవి ఆలయం వద్ద ఉదయం సోమోర్జిత్ను ఉగ్రవాదులు కాల్చారు. తీవ్రంగా గాయపడిన ఆయన అస్సాం రైఫిల్స్కు చెందిన కీ లొకేషన్ పాయింట్ (కేఎల్పీ)లో చికిత్స పొందుతూ మరణించారు. సాయంత్రం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో శైలేశ్వర్ అమరుడయ్యారు. కానిస్టేబుల్ ఎన్.భీమ్ (35) ఎడమకాలిలో బులెట్ గాయం కాగా, ఏఎస్ఐ సిద్ధార్ద్ థోక్చోమ్ (35) ముఖం, చెవులకు గాయాలయ్యాయి. ఆయన్ను ఇంఫాల్లోని రిమ్స్కు చికిత్స కోసం హెలికాప్టర్లో తరలించారు. ఎస్బీఐ మోరే యూనిట్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక పోలీసు స్థావరంపై ఉగ్రవాదులు రాకెట్ ఆధారిత గ్రనేడ్ను పేల్చడంతో రెండువైపులా కాల్పులు మొదలయ్యాయని అధికారులు వివరించారు.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
