బెంగళూరు: 9 మర్చం బైక్ ట్యాక్సీల నిర్వహణపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. మోటారు వాహన చట్టం నిబంధనలను పాటించకపోగా.. మహిళలకు ఈ సేవలు ఏమాత్రం సురక్షితం కాదని తాము గుర్తించినట్లు సర్కారు వెల్లడించింది. బెంగళూరు మెట్రో సేవలకు అనుసంధానంగా 2022లో బైక్ ట్యాక్సీ పథకాన్ని అమలుచేశారు. మెట్రోరైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) నేతృత్వంలో మెట్రో రైలులో ప్రయాణించేవారిని సురక్షితంగా, తక్కువ ఛార్జీలతో ఇంటివద్దకు చేర్చేందుకు బైక్ సేవలను ప్రారంభించారు. కొందరు ఈ సేవలను దుర్వినియోగం చేస్తూ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు రవాణాశాఖకు వెల్లువెత్తాయి. ‘కొన్ని యాప్ ఆధారిత ప్రైవేటు సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రయాణాలకు అనువుగాని ఈ బైక్‌లను రవాణా వాహనాలుగా ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఈ పథకం ద్వారా పన్నులు వసూలుచేయడమూ కష్టంగా మారింది. ప్రయాణికులు, ఆటో, క్యాబ్‌డ్రైవర్లతో బైక్ రైడర్లు ఘర్షణ పడుతున్న సంఘటనలు సైతం పెరిగాయి. శాంతిభద్రతలు, మహిళల రక్షణ దృష్ట్యా ఈ పథకాన్ని రద్దుచేస్తున్నాం’ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. బైక్ ట్యాక్సీ చట్టాన్ని 2021లో అప్పటి భాజపా ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీన్ని ఆటో, క్యాబ్ యజమానులు, డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. రద్దు చేయాలని వారు ఆందోళనలకు దిగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది
