దిల్లీ, 1 ఫిబ్రవరి : నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా నేతృత్వంలో ఏర్పాటైన 16వ ఆర్థికసంఘం సభ్యులుగా నలుగురు నియమితులయ్యారు. 15వ ఆర్థికసంఘం సభ్యుడిగా, కేంద్ర ఆర్థికశాఖలోని వ్యయవిభాగం కార్యదర్శిగా పనిచేసిన అజయ్ నారాయణ్ ఝా, అదే విభాగంలో పనిచేసిన మాజీ ప్రత్యేక కార్యదర్శి ఏనీ జార్జ్ మాథ్యూ, అర్థ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిరంజన్ రాజాధ్యక్ష, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్లను ఆర్థికసంఘం పూర్తికాల సభ్యులుగా నియమిస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026 ఏప్రిల్ 1 నుంచి అయిదేళ్ల కాలపరిమితికి ఈ సంఘం నివేదిక అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 2025 అక్టోబరు 31వరకు గడువు ఇచ్చింది.
