ముంబై: బిజినెస్; ఏప్రిల్
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం ట్రేడింగ్లో సరికొత్త రికార్డు గరిష్ఠాలకు చేరాయి. ఆరంభంలో లాభ, నష్టాల మధ్య తీవ్ర ఊగిసలాటలకు లోనైనప్పటికీ, మధ్యాహ్నం నుంచి ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆర్థిక సేవల రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు ఇంట్రా డే కనిష్ఠ స్థాయిల నుంచి భారీగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ 350.81 పాయింట్ల లాభంతో 74,227.63 వద్ద సరికొత్త జీవితకాల గరిష్ఠ ముగింపు స్థాయిని నమోదు చేసింది. కాగా, 74,501.73 వద్ద ఆల్టైం ఇంట్రాడే రికార్డు నమోదైంది. నిఫ్టీ విషయానికొస్తే, 80 పాయింట్ల పెరుగుదలతో 22,514.65 వద్ద స్థిరపడింది. సూచీకిది కొత్త రికార్డు ముగింపు స్థాయి. సెన్సెక్స్లోని 30 కంపెనీల్లో 17 లాభపడ్డాయి.
