ఢీల్లీ, 8 జనవరి (హిం.స)
భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. మాల్దీవుల మంత్రుల తీరుపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది.
దీంతో ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్కు ఇబ్రహీం షహీబ్ వచ్చి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటికొచ్చాయి. ఈ వివాదం గురించి ఇబ్రహీం షహీబ్తో భారత ప్రభుత్వం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే మాల్దీవుల హైకమిషనర్కు భారత ప్రభుత్వం సమన్లు పంపిన కొన్ని గంటల్లోనే అక్కడి భారత హైకమిషనర్కు కూడా మాల్దీవుల ప్రభుత్వం సమన్లు పంపింది. తమతో భేటీ కావాల్సిందిగా మాలేలోని భారత హైకమిషనర్ మును మహావార్కు పంపిన నోటీసుల్లో పేర్కొంది.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
