ఢిల్లీ,13,, డిసెంబర్ (హిం.స) మహదేవ్ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ యాప్ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్)ను దుబాయ్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈడీ (ED) అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అతడిని దుబాయ్పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు బుధవారం వెల్లడించాయి
ఛత్తీస్గఢ్లోని భిలాల్ ప్రాంతానికి చెందిన రవి ఉప్పల్, సౌరభ్ చంద్రఖర్ దుబాయ్ కేంద్రంగా భారత్లో మహదేవ్ బెట్టింగ్ యాప్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ముసుగులో వీరు మనీలాండరింగ్కు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఈ నెట్వర్క్తో సంబంధం ఉన్న కోల్కతా, భోపాల్, ముంబయి వంటి తదితర నగరాల్లో సోదాలు నిర్వహించగా.. రూ. వందల కోట్లలో అక్రమ నగదు బయటపడింది. బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్షోర్ ఖాతాలకు తరలించేందుకు హవాలా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు ఈడీ గుర్తించింది.
ఈ కేసులో ఈడీ ఇప్పటికే ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. రవి ఉప్పల్కు వనౌటు దేశ పాస్పోర్ట్ ఉందని, దాన్ని ఉపయోగించి అతడు పలు దేశాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని దర్యాప్తులో తేలినట్లు ఈడీ పేర్కొంది. అయితే, అతడు భారత పౌరసత్వాన్ని వదులుకోలేదని, దీనిపైనే ఆస్ట్రేలియా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది.
హిందుస్థాన్ సమాచార,నాగరాజ్
