, కోల్కతా , 10,జనవరి (హిం.స)ఈడీ బృందంపై దాడి నేపథ్యంలో సంస్థ ఇంఛార్జి డైరెక్టర్ రాహుల్ నవీన్ సోమవారం అర్ధరాత్రి కోల్కతా చేరుకున్నారు.
ఈ నెల 5న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందాలపై జరిగిన దాడికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికను తమకు పంపాలంటూ కేంద్ర హోంశాఖ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్ఖాలిలో టీఎంసీ నేత షాజహాన్ షేక్ నివాసంలో సోదాల కోసం ఈడీ అధికారులు అక్కడికి చేరుకోగా ఆయన అనుచరులు వారిపై దాడికి పాల్పడ్డారు. నాటి ఘటనలో ముగ్గురు ఈడీ అధికారులు గాయపడ్డారు. వారి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, వాలెట్లు దోపిడీకి గురయ్యాయి. ఈ క్రమంలో షాజహాన్ పరారయ్యారు. ఆయన కోసం ఈడీ లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. దేశం నుంచి జారుకోకుండా చూడాలని సంబంధిత వర్గాలకు సూచించింది. ఈ నెల 5నే మరో ఘటనలో బాంగావ్లో టీఎంసీ నేత శంకర్ ఆధ్యా అరెస్టు సందర్భంగానూ మరో ఈడీ బృందంపైనా దాడులు జరిగాయి. వారి వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థల బృందాలపై దాడుల నిరోధానికి తీసుకున్న చర్యల నివేదికనూ పంపాలంటూ సూచించింది.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
