ముంబై, 01 జనవరి (హి.స.)నూతన సంవత్సరం 2026 వేళ బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరే శుభవార్త. దేశీయ మార్కెట్లో బంగారం రేట్లు భారీగా పడిపోతున్నాయి. గత రెండు రోజులుగా భారీగానే దిగివచ్చిన గోల్డ్ రేట్లు ఈరోజు సైతం తగ్గాయి. మూడు రోజుల్లో బంగారం రేటు భారీగానే పడిపోయిందని చెప్పవచ్చు. వెండి రేటు అయితే ఏకంగా రూ.28 వేల మేర దిగివచ్చింది. బంగారం ధరలు తగ్గేందుకు ముఖ్యంగా అమెరికా ఫెడ్ కారణమవుతున్నట్లు తెలుస్తోంది. యూఎస్ ఫెడ్ మినిట్స్ రిపోర్ట్ బయటకి రావడం ఈరోజు ధరలు తగ్గేందుకు కారణమని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన ఫెడ్ సమావేశానికి సంబంధించిన ఈ నివేదికలో వడ్డీ రేట్ల కోతకు సంబంధించిన కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఏడాదిలోనూ మరోసారి వడ్డీ రేట్లు తగ్గిస్తారన్న ప్రకటనకు భిన్నంగా సమావేశంలో చర్చ జరిగిందని, సభ్యుల మధ్య విభేదాలు తలెత్తాయని మినిట్స్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. అంటే ఈ ఏడాది వడ్డీ రేట్లు తగ్గించదన్న అంచనాలు వెలువడ్డాయి. దీంతో ఇన్వెస్టర్లు బంగారం, వెండిపై పెట్టుబడును ఉపసంహరించుకుంటున్నారు. ప్రాఫిట్ బుకింగ్‌కి దిగారు. దీంతో పసిడి ధరలు భారీగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో జనవరి 1, 2026 గురువారం రోజున హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్ల గురించి తెలుసుకుందాం.
.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 45 డాలర్ల మేర దిగివచ్చింది. దీంతో ప్రస్తుతం ఔన్స్ పసిడి రేటు 4325 డాలర్ల స్థాయికి తగ్గింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఈరోజు 8.27 శాతం మేర పడిపోయింది. దీంతో ఔన్స్ వెండి రేటు 71.47 డాలర్ల వద్దకు దిగివచ్చింది.
హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా మూడోరోజూ తగ్గాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ఈరోజు తులంపై రూ.1310 మేర పడిపోయింది. ఇక మూడు రోజుల్లో చూసుకుంటే రూ.7530 మేర తగ్గింది. దీంతో ఈరోజు 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,34,890 వద్దకు దిగివచ్చి ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు ఇవాళ రూ.1200 మేర పడిపోయింది. దీంతో తులం గోల్డ్ ధ రూ. 1,23,650 వద్దకు తగ్గింది.
—————
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV
