అమరావతి, అక్టోబరు 15 : విద్యుత్తు కోతలతో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. ఈ అక్టోబరు నెలలో తీవ్రమైన ఎండల వేడికి ప్రజలు అల్లాడుతుంటే.. మరోవైపు రైతులు కరెంటు ఎప్పుడొస్తుందో తెలియక రాత్రిళ్లు కూడా మోటార్ల వద్దనే పడుకుంటున్నారని చెప్పారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు సెల్‌ఫోన్ వెలుతురులో శస్త్రచికిత్సలు చేయాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్తు కష్టాలు, ప్రజల అవస్థలకు జగన్‌రెడ్డి చేతగానితనం, అసమర్థ పాలనే కారణమంటూ ధ్వజమెత్తారు.
