హైదరాబాద్, 2 డిసెంబర్ (హి.స.)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకుడు దేశంలో మరొకరు లేరని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మర్రి చెన్నారెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను మర్రి చెన్నారెడ్డి కుటుంబ సభ్యుడినని సగర్వంగా చెప్పుకుంటానని అన్నారు.
ఆయన తనను కొడుకులా భావించారని, నాటి ప్రధాని పీవీ నరసింహారావుకు పరిచయం చేశారని గుర్తు చేశారు. మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకుడు దేశంలో లేరని.. భవిష్యత్తులో కూడా రారని అన్నారు. పాలనలో గొప్ప దార్శనికుడు, మార్గదర్శి మర్రి అని కొనియాడారు. యావత్ దేశం చూసిన అరుదైన రాజనీతిజ్ఞత, విషయ పరిజ్ఞానంలో ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. గవర్నర్ పదవికి వన్నె తెచ్చిన మహానుభావుడు మర్రి చెన్నారెడ్డి అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
—————
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..
