నారాయణపేట, 11 నవంబర్ (హి.స.) నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెదిరిపహాడ్ తండా గుట్టపై గత మూడు రోజుల నుంచి నాలుగు చింతపులు సంచరిస్తుండటంతో తాండావాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక చిరుతపులి గుట్ట దిగి తాండ వైపు వస్తుండగా గమనించి భయంతో కేకలు వేయడంతో అటువైపు వెళ్లిన ఒక కుక్కను పట్టుకుని గుట్ట పైకి వెళ్ళినట్టు తెలిపారు.
గత మూడు రోజుల నుండి ఉదయం, సాయంత్రం వేళల్లో గుట్టపై ఉన్న పెద్ద బండరాయి పైకి రెండు పెద్ద చిరుతలు రెండు కూన చిరుతలు వస్తున్నాయని అది గమనించిన తండావాసులు కేకలు వేయడంతో మళ్లీ పొదల్లోకి పారిపోతున్నాయని అంటున్నారు. సోమవారం సాయంత్రం మళ్లీ ఎప్పటిలాగే గుట్టపై ఉన్న పెద్ద బండరాయి పైకి చిరుత పులులు వచ్చి కూర్చోవడంతో తాండ వాసులు మరోసారి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి తండా వాసులు ఎవరు బయటకు రావద్దని, తప్పనిసరి వెళ్లాల్సి వస్తే సమూహంగా వెళ్లాలని సూచించారు. గుట్టపై బోన్లు ఏర్పాటు చేసి చిరుతలను బంధించే ప్రయత్నం చేస్తామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు
