న్యూఢిల్లీ: ,21 ఆగస్టు (హి.స.
ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న సమయంలో దిల్లీ సీఎం రేఖా గుప్తా (Rekha Gupta)పై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దిల్లీలోని వీధి కుక్కలను తరలిస్తున్నారనే కోపంతోనే (Stray Dogs Issue) తాను దిల్లీ ముఖ్యమంత్రిపై దాడి చేశానని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించే ఏర్పాట్లుచేస్తున్నామని ఇటీవల దిల్లీ సీఎం రేఖాగుప్తా మీడియాకు తెలిపారు. జంతు ప్రేమికుడైన తనను ఈ విషయం ఎంతగానో బాధించడంతో.. ఈ చర్యలను నిలిపివేయాలని అభ్యర్థించడానికి ఆమెను కలిసేందుకు టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించి మరీ గుజరాత్ నుంచి దిల్లీ వచ్చినట్లు సకారియా తెలిపాడు.
ముఖ్యమంత్రిని తన నివాసంలో కలిసి కుక్కల సమస్య గురించి మాట్లాడడానికి ప్రయత్నించగా అది కుదరకపోవడంతో..‘జన్ సున్వాయ్’ కార్యక్రమానికి వెళ్లినట్లు నిందితుడు పేర్కొన్నాడు. సమస్యను రేఖా గుప్తాకు వివరించగా.. తన విజ్ఞప్తిని ఆమె పట్టించుకోకపోవడంతో కోపంతో దాడి చేశానన్నాడు. సకారియా కుక్కల సంరక్షణ సంస్థలతో కలిసి పని చేస్తుంటాడని.. అతడికి మూగజీవాలంటే ఇష్టమని కుటుంబసభ్యులు వెల్లడించినట్లు జాతీయమీడియా వర్గాలు పేర్కొన్నాయి.
—————
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు
