తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ మే 10(హిం స,)తెలoగాణలో లోక్ సభ ఎన్నికల వేళ పాలమూరు రాజకీయాలు హీటెక్కాయి. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేక దృష్టిసారించాయి. సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ అగ్రనేతలు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఇరు పార్టీల నేతలు పాలమూరు గడ్డపై తమతమ ప్రచారాలను వేగం పెంచారు. ఈ క్రమంలో ఇవాళ ఒకే రోజు సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ సభలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరగనున్నాయి. గంట తేడాతో పీఎం, సీఎంల బహిరంగ సభలు జరగనుండటంతో వీరి మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇకపోతే ఈ పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ అభ్యర్థులు డీకే అరుణ, వంశీచంద్ రెడ్డి మధ్య పోటీ నువ్వా నేనా అన్న చందంగా ఉండగా డీకే అరుణ, రేవంత్ రెడ్డి మధ్యనే ప్రచార మాటల యుద్ధం పెద్ద ఎత్తున జరుగుతుంది. మాటకు మాట సమాధానం అవుతుండడంతో ఈ ఎన్నికలు హీటెక్కాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఇటీవల జరిగిన డీకే అరుణ రోడ్డు షో సందర్భంగా హాజరైన బిజేపి ఎంపీ నవనీత్ కౌర్ పై కేసు కూడా నమోదయింది. పార్లమెంటు ఎన్నికల్లో మొదట వంశీచంద్ రెడ్డి, డీకే అరుణ మధ్య కొద్దిపాటిగా వార్ జరిగినప్పటికీ ఆ తర్వాత ఎక్కువ వార్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి, డీకే అరుణల మధ్యనే మాటల యుద్ధం కొనసాగుతోంది. అది ఎంతవరకు అంటే ఒకరినొకరు వ్యక్తిగతంగా తిట్టుకునేంతగా కొనసాగుతోంది. తాజాగా డీకే అరుణ షాద్ నగర్ రోడ్డు షో లో రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలకు చెప్పుతో కొట్టాలంటూ, కాలిగోటితో సమానం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, అంతకుముందు రేవంత్ రెడ్డి ప్రసంగాల్లో దొరసాని, మేకప్, పండబెట్టి తొక్కుతా తిట్లు తదితర వివాదాస్పద అంశాలు ఎన్నికల్లో వినిపించాయి. దీంతో ఇరువురి మధ్య రాజకీయ తగవు పెరిగింది.
*వివాదానికి మొదటీ సారి బీజం పడింది ఇలా*
గతంలో మంత్రిగా ఉన్న సమయంలో డికె అరుణ, అప్పటి తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి పరస్పరం తిట్ల దండకానికి ఎత్తుకున్నారు. అప్పుడు జరిగిన మహబూబ్నగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది. ఇద్దరు పరస్పరం తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. ప్రోటోకాల్ పాటించడం లేదని రేవంత్ రెడ్డి అరుణను విమర్శించారు. గుండాలతో రేవంత్ రెడ్డి శిలాఫలకాలను ధ్వంసం చేయిస్తున్నారని మంత్రి ఆరోపించారు. నువ్వెంత నీ లెక్కెంత అని అరుణ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
మద్యం, ఇసుక సిండికేట్లను అరుణ ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. మద్యం సిండికేట్లపై నీ భరతం పడతానని రేవంత్ రెడ్డి అరుణను ఉద్దేశించి అన్నారు. కామన్ సెన్స్ లేదని రేవంత్ రెడ్డి అరుణను అంటే యూజ్లెస్ ఫెల్లో అంటూ ఆమె ఎదురు దాడికి దిగారు. నీకు సంస్కారం లేదంటే నీకు లేదని పరస్పరం దూషించుకున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని అరుణ రేవంత్ రెడ్డికి సూచించారు. తాను నోరు విప్పితే ఏమవుతుందో తెలియదని ఆయన అన్నారు.
గతంలో ఈ బాడీ వేడి అంశాలే నేటికీ వీరి మధ్య రాజకీయ తగవుకు సంబంధించి స్పృశిస్తున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే..?
పాలమూరు బిడ్డలు నూటికి నూరు శాతం నాకు అండగా నిలబడ్డారు. అలాంటి నాకు నీ మీద (డీకే అరుణ) అసూయ ఎందుకుంటుంది.? ఎందుకు కోపం ఉంటుంది.? నాకు నీకు పోటీ ఏంటి..? పొంతనేంటి..? ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాకు శత్రువులు లేరు. ప్రత్యర్ధులు లేరు. పాలమూరు అభివృద్ధి కోసమే నా తపనంతా. 70ఏళ్ల తరువాత పాలమూరుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాకు అండగా నిలబడండి. పాలమూరును రాబోయే వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తా. పార్టీలకు అతీతంగా ముందుకు రండి. పాలమూరు అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పార్లమెంటు ఎన్నికల్లో తన ఉద్దేశాన్ని ప్రసంగాల్లో చెప్పారు.
డీకే అరుణ ఏమంటున్నారంటే..
తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆగస్ట్-15 లోగా హామీలు అమలు చేయలేకపోతే సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.
పాలమూరు అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డిని ఉద్ధేశించి అప్పట్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె కూడా అంతే ఘాటుగా బదులిచ్చారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఒక ఆడ బిడ్డను ఓడించేందుకు రాక్షసుల్లాగా, రాబందుల్లాగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అనే సోయిని మరిచి రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. పాలమూరు బిడ్డ ఈ ప్రాంతం కోసం అన్ని రంగాల్లో కృషి చేస్తే అసూయ పడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఏనాడైనా పోరాటం చేశారా? అని ప్రశ్నించారు డీకే అరుణ.
పండబెట్టి తొక్కుతారా..?
ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న రేవంత్ స్థాయి ఏంటి? అని ప్రశ్నించారు డీకే అరుణ. నా బాగోతం ఏందో మీ బాగోతం ఏందో పాలమూరు చౌరస్తాలో తేల్చుకుందాం రండి అంటూ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి స్థానాన్ని అగౌరవ పరిచేలా ఆయన మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి దొర అని, ఆయనది దొర కుటుంబం అని, తమది రైతు కుటుంబం అని చెప్పారు డీకే అరుణ. మమ్మల్ని పండబెట్టి తొక్కుతారంటా జాతి, రంగు గురించి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డల గురించి అలా మాట్లాడతారా, ఇదేనా సంస్కారం అని ప్రశ్నించారు డీకే అరుణ. ఇలాంటి ప్రసంగాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీకే అరుణ మధ్య రాజకీయ వ్యత్యాసం పెరిగింది. అంతేకాదు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అభ్యర్థి వంశీ రెడ్డి ప్రస్తావన ఎక్కడికి పోయిందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం మహబూబ్నగర్ పార్లమెంటు ఎన్నికల్లో డీకే అరుణ రేవంత్ రెడ్డి మధ్యనే మాటలు యుద్ధం కొనసాగుతోంది.
