ఒంగోలు, దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అనుచరుల అభిప్రాయలకనుగుణంగా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి డాక్టర్ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పాపారావు తదితరులు ఎమ్మెల్యేను కలిసినప్పుడు కూడా అదే సంకేతం ఇచ్చారు. మరోవైపు ఎమ్యెల్యే సోదరుల్లో ఒకరైన రవీంద్ర కనిగిరి నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామంలో అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. సీఎంతోపాటు ఆయన పొల్గొన్న కార్యక్రమాలు, వైసీపీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు. బుధవారం దర్శిలో ఆయన నియోజకవర్గంలోని తన ముఖ్యఅనుచరులతో సమావేశమయ్యారు. అనుచరుల్లో అత్యధికులు ‘వైసీపీ అధిష్ఠానం మనకు అన్యాయం చేసింది.. శివప్రసాద్‌రెడ్డి మనల్ని అసలు మనుషులుగానే చూడడం లేదు.. మనం టీడీపీ కూటమికి మద్దతు ప్రకటించడం సముచితంగా ఉంటుంది’ అని ఆయనకు సూచించారు. ఎమ్మెల్యేను గౌరవించకుండా, కుల ప్రాతిపదికన శివప్రసాద్‌రెడ్డిని సీఎం బలపరిచారని కొందరు అనగా, కులం వారికి జగన్ చేసిందేమీ లేదని సుబ్బారెడ్డి, వారి అనచరులు ఉదహరించారు. ఇలా సాగిన సమీక్ష అనంతరం మనం టీడీపీ అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది.
