అమరావతి 21 మార్చ్రా ష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అధికార వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు ఏమాత్రం లెక్క చేయడం లేదు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను తోసిరాజని యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బుధవారం తన నివాసంలో రహస్యంగా 22మంది బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరులో బుధవారం జరిగిన పురాతన రామాలయం పునర్నిర్మాణ భూమి పూజా కార్యక్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. ముద్దనూరు రెవెన్యూ కార్యాలయంలో గోడౌన్ డీటీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుధీర్‌యాదవ్ దంపతులు పూజలో కూర్చున్నారు. దీనిపై ఎంపీడీవో చంద్రమౌళిని వివరణ కోరగా.. దీనిపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఇక పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ముఖ్య అనుచరుడు కళ్లం విజయభాస్కరరెడ్డికి చెందిన కేవీఆర్ మార్టులో 1,684 చీరలను బుధవారం అధికారులు సీజ్ చేశారు. చీరల బాక్సులపై సీఎం జగన్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫొటోలున్నాయి. కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న చీరలను తహసీల్దారు కార్యాలయానికి తరలించారు. మరోవైపు బాపట్ల జిల్లా రేపల్లె 1వ వార్డు కృష్ణుడి దేవాలయం వద్ద బుధవారం వైసీపీ అభ్యర్థి ఈవూరి గణేశ్ అధ్యక్షతన సభ నిర్వహించారు. పథకాల లబ్ధిదారులను మెప్మా సిబ్బంది, వలంటీర్లు సభకు తరలించారు. అనుమతి తీసుకోకుండా జనాన్ని తరలించి సభ ఎలా నిర్వహిస్తారని ఎన్నికల డీటీ, రూట్ ఆఫీసర్ నిలదీశారు. కోడ్ ఉల్లంఘనలపై కేసు నమోదు చేసినట్లు ఆర్వో హేలా సోరాన్ తెలిపారు.
