



రాంచీ:02 ఫిబ్రవరి : రాజకీయ వేడి రాజుకున్న ఝార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గా జేఎంఎం నేత చంపయీ సోరెన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకలో గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా మంత్రులుగా ప్రమాణం చేశారు. త్వరలోనే అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది.
మనీలాండరింగ్ కేసులో జేఎంఎం (JMM) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌పై ఈడీ విచారణ నేపథ్యంలో.. గత రెండు రోజులుగా ఝార్ఖండ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. జనవరి 31న హేమంత్‌ను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఆ వెంటనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడం.. కొత్త ముఖ్యమంత్రిగా చంపయీని ఎన్నుకోవడం, ఆ తర్వాత హేమంత్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేయడం చకాచకా జరిగిపోయాయి.
