తిరుపతి (తిలక్‌రోడ్), జనవరి 24 (హిం.స): మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి ఇప్పిస్తామని మంత్రి రోజా అన్న కుమారస్వామి రూ.40లక్షలు తీసుకుని మోసం చేశారని తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు.
దళిత మహిళ అయిన తనకు జగనన్నే న్యాయం చేయాలని కోరారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘17వ వార్డు కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన నన్ను మున్సిపల్ చైర్‌పర్సన్ చేస్తానని రోజా ప్రకటించారు. ఈ విషయమై పుత్తూరు వైసీపీ ఇన్‌చార్జి, తన అన్న కుమారస్వామిని కలవాలని రోజా చెప్పడంతో కలిశాను.
చైర్‌పర్సన్ పదవికి రూ.70లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రూ.40లక్షలు 3 కంతుల్లో ఇచ్చా. ఆ తర్వాత వేరే వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చారు. అదేమని అడిగితే ఐదేళ్లకుగాను చెరో రెండున్నరేళ్లు పదవిలో ఉంటారని చెప్పడంతో అయిష్టంగానే ఒప్పుకున్నా. రెండున్నరేళ్ల తర్వాత కూడా పదవి ఇవ్వలేదు. కుమారస్వామిని కలిసి తమ డబ్బయినా వెనక్కిమ్మని అడగ్గా.. రూ.40 లక్షలు ఇవ్వలేనని, రూ.29లక్షలే ఇస్తాననీ.. అది కూడా రెండు నెలల తర్వాత ఇస్తానని చెప్పారు.
