అయోధ్య,22,జనవరి (హిం.స) అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య అట్టహాసంగా జరిగింది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు.
అయోధ్య: అయోధ్యలో వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. నవనిర్మిత రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం తమ అంతరంగంలో ఆత్మారాముడిని కొలుచుకున్నారు.
రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ఎటు చూసినా రామనామ స్మరణతో మార్మోగింది. నగరమంతా రామ్ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఈ మహత్కార్యానికి దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7 వేల మంది విచ్చేశారు. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పులకించిపోయారు.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
