






అమరావతి: 07 జనవరి (హిం.స) నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన గుంటూరులో ఓ ఛానల్‌తో మాట్లాడారు. ఇటీవల సీఎంను కలిసినప్పుడు గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు స్థానాల్లో పోటీ విషయమై చర్చ జరిగిందన్నారు.
పార్టీ నిర్ణయాలు, ప్రతిపాదనలు, ఆలోచనలు సీఎం చెప్పగా.. తన ఆలోచనలూ పార్టీకి వెల్లడించానని స్పష్టం చేశారు. నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నాననే వాదన వినిపించానన్నారు. అక్కడి నుంచే ఎందుకో స్పష్టంగా వివరించానని తెలిపారు. అయితే.. సీఎం తన అభిప్రాయాలతో కన్విన్స్ అయ్యారని అనుకోలేదన్నారు. నరసరావుపేట టికెట్ ఇవ్వని పరిస్థితుల్లో రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ప్రశ్నకు.. ‘ఇంకా అంతదూరం ఆలోచించలేదు’ అని శ్రీకృష్ణదేవరాయలు సమాధానం ఇచ్చారు.
మరోవైపు నరసరావుపేట పార్లమెంటు వైసీపీ టికెట్‌ను శ్రీకృష్ణదేవరాయలుకు ఇవ్వకపోతే వైకాపాకు రాజీనామా చేస్తామని యడ్లపాడు, చిలకలూరిపేట జడ్పీటీసీ సభ్యులు వాసు, సుధారాణి తెలిపారు. నాదెండ్ల జడ్పీటీసీ సభ్యుడూ ఇదే బాటలో వస్తారని హెచ్చరించారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
